కేశవ గోవింద మాధవా యని….

సెప్టెంబరు 26, 2007

కీర్తనకి, సాహిత్యానికి మధ్య కొన్ని పాఠ భేధాలున్నాయి. కానీ సాహిత్యం సరయినదే అని నేను నమ్ముతున్నాను. 

 

కేశవ గోవింద మాధవా యని
కీర్తన చేసే దెన్నటికో
నాశము లేని మోక్షమును పొందుట
నారాయణ నాకెన్నటికో ||కేశవ||

భక్తి మృదంగము తాళాదులతో
భజనలు చేసే దెన్నటికో
శక్తి మీరగ నృత్యము సేయుట
సారసాక్ష నా కెన్నటికో ||కేశవ||

పూవులతో నీ పాదంబులకును
పూజలు చేసే దెన్నటికో
నైవేద్యం బిడి పరమ భక్తిని
చాటించుట నా ఎన్నటికో ||కేశవ||

పాహి పాహియని పరమపురుష
నీ పాదంబుల బడు టెన్నటికో
దేహి దేహియని నీ కృపకొరకై
దేవురు లాడే దెన్నటికో ||కేశవ||

రామదాసులను బ్రోచినట్లు
సంరక్షణ చేసే దెన్నటికో
భామామణి రుక్మిణితో గూడి
బాసలు చేసే దెన్నటికో ||కేశవ||


భజన చేసే విధము దెలియండి…

సెప్టెంబరు 24, 2007

భజన చేసే విధము దెలియండి, జనులార మీరు
నిజము కనుగొని మోదమందండి ||భజన||

భజన చేసే విధము దెలియక
నిజముగా హరిభక్తు లనుకొని
మదగజము దెగవ్రేయ లేకను
సుజనులని దిరుగంగ నేలను ||భజన||

జ్ఞానులనుకొని యెగసి పడకండీ
జనులార తత్వజ్ఞానమందే మనసు నిలపండీ
జ్ఞానులనుకొని యెగసిపడి
అజ్ఞానములు పైబెట్టుకొన్నను
మానసంబున బుట్టి చచ్చియు
పూని మరి జన్మింపవలయును ||భజన||

వారు వీరని యెంచబోకండి
జనులార మీరు నోరుచచ్చినవారు కాకండి
వారు వీరని యెంచుటెల్లను
సారము లేనట్టి హీనత
పౌరుషులకే గాక పుణ్యము
ఊరి కథలం దేమి యున్నది ||భజన||

ధరణి శ్రీ నరహరిని గొలువండి
జనులార మీరు
పరమపదవి బొంద గోరండి
ధరను శ్రీఘటికాద్రి నరహరి
పరమభక్తవరుల మనుకొని
విరివిగా నరసింహదాసుని
వరకవిత్వము సార మనుకొని ||భజన||
 


అందరికీ నా స్వాగత కీర్తనాంజలి!

సెప్టెంబరు 24, 2007

అందరికీ నమస్కారములు. మన తెలుగిండ్లలో పాడుకొనే భక్తి పాటలు, భజన కీర్తనలు కొన్నేళ్ళ క్రిందట మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా నాయనమ్మ మరియు అక్క సేకరించి కూర్చారు. ఇందులో పాటలు, భజనలు, కీర్తనలు వంటివీ మరియు త్యాగరాజ, ముత్తుస్వామి గార్ల కీర్తనలతో సహా ఇతరములూ ఉన్నాయి. అవన్నీ “భజన కీర్తనలు” అన్న పేరుతో ఒక పుస్తక రూపంలో చాలా కాలం క్రిందటే వచ్చాయి. ఆ పుస్తకాన్ని అంతర్జాలంలోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ బ్లాగు ఉద్ధేశ్యం. ఇందులోని ప్రతి కీర్తన/పాట కి ఆడియో సమకూర్చాలని ఆలోచన. ప్రస్తుతానికి సాహిత్యం మాత్రమే ఇస్తున్నాను. కొందరికయినా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.